పీఎంగా నీకే నా ఓటు.. ఆమె వ్యాఖ్యలపై సోనూ సూద్ రియాక్షన్

బాలీవుడ్ హాట్ బ్యూటీ హుమా ఖురేషి ఇటీవల మాట్లాడుతూ దేశానికి సోనూసూద్ వంటి వ్యక్తి పీఎంగా కావాలంటే పేర్కొంది. సోనూసూద్ పీఎం రేసులో ఉంటే తన ఓటు ఆయనకే అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఈ సమయంలో ఆయన ప్రభుత్వం కంటే ఎక్కువగా ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఆక్సీజన్ నుండి మొదలుకుని అవసరం అయిన మందుల వరకు అన్ని కూడా ఆయన సామాన్యులకు అందిస్తున్నాడు. ఎన్నో వందల మంది ప్రాణాలు కాపాడి వేలాది మందికి తన సాయంను అందజేసిన సోనూసూద్ ను ప్రతి ఒక్కరు అభినందిస్తూ ఉన్నారు. హుమా ఖురేషి మరో అడుగు ముందుకు వేసి సోనూసూద్ ప్రధాని అవ్వాలనే కోరికను వ్యక్తం చేసింది.

హుమా ఖురేషి చేసిన వ్యాఖ్యలపై సోనూసూద్ కాస్త లేట్ గా రియాక్ట్ అయ్యాడు. ఇది కాస్త అతి అయ్యింది అంటూ స్పందించాడు. ఇలా మాట్లాడటం ఆమె మంచితనం. అందుకు నేను అర్హుడిని అని ఆమె భావిస్తే నేను ఖచ్చితంగా గౌరవంగా భావిస్తాను. కాని అందుకు నేను అర్హుడిని అని మాత్రం నేను భావించడం లేదు. నేను వయసు మరియు అనుభవంలో చాలా చిన్న వాడిని. అంతటి గౌరవంను దక్కించుకునేందుకు నేను అర్హుడిగా భావించడం లేదు అంటూ చాలా సున్నితంగా ఆమె వ్యాఖ్యలపై స్పందించాడు.

ఇంకా సోనూ సూద్ మాట్లాడుతూ.. నేను ఏదో ఆశించి ఇవన్నీ చేయడం లేదు. ప్రస్తుతానికి నేను చాలా సంతోషంగానే ఉన్నాను. అన్ని విషయాల్లో నాకు సంతృప్తి ఉంది. నా నటన మరియు నా సేవా కార్యక్రమాల విషయంలో ప్రస్తుతం దృష్టి పెట్టి ఉన్నాను అంటూ రాజకీయాల పై ప్రస్తుతానికి ఆసక్తి లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. కాలంతో పాటు తాను ముందుకు సాగాలని భావిస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. విలన్ గా ఇంత కాలం కెరీర్ లో ముందుకు నడిచిన సోనూసూద్ ఇప్పుడు హీరోగా నటించేందుకు సిద్దం అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి.