సోనూ సూద్ కొత్త జర్నీ.. రియల్ హీరోకు ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్

2020 సంవత్సరం ముందు వరకు సోనూ సూద్ ఒక సినిమా నటుడు.. బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాల్లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించే ఒక స్టార్. కాని 2020 నుండి ఆయన నేషనల్ స్టార్ అయ్యాడు. అది కూడా రియల్ స్టార్.. రియల్ హీరోగా కీర్తించబడుతున్నాడు. 2020 సంవత్సరంలో కరోనా దేశంలో భయభ్రాంతులకు గురి చేసిన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా లాక్ డౌన్ ను విధించింది. దాంతో లక్షల మంది వలస కూలీలు తమ తమ ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు.

ఆ సమయంలో కోట్ల రూపాయలను సోనూసూద్ ఖర్చు చేసి బస్సులు రైల్లు కార్లు విమానాలను కూడా వినియోగించి వలస కార్మికులను ఆదుకుని వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సహాయం చేశాడు. ఆ తర్వాత కూడా కరోనాతో పోరాటం చేస్తున్న వారికి సహకారం అందించాడు. ఇక సెకండ్ వేవ్ సమయంలో ఆక్సీజన్ ప్రధాతగా సోనూసూద్ నిలిచాడు.

ఏదైనా అవసరం అయితే ప్రభుత్వం వైపు కాకుండా తన వైపు చూసేలా సోనూసూద్ చేశారు అనడంలో సందేహం లేదు. ఆక్సీజన్ ను అందించడం ద్వారా వందల మంది ప్రాణాలను కాపాడిన వ్యక్తి సోనూసూద్. ఆ తర్వాత కూడా ఎంతో మందికి బాసటగా నిలుస్తూ అద్బుతమైన సేవా కార్యక్రమాలను చేస్తున్న వ్యక్తిగా సోనూసూద్ నిలిచాడు. ఇదే సమయంలో ఆయన వరుసగా సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.

సౌత్ లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్ ను కొనసాగిస్తున్న సోనూసూద్ మరో వైపు మొదటి సారి బుల్లి తెరపై సందడి చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఆయన తన కొత్త జర్నీని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించి అభిమానులకు వినోధాన్ని పంచబోతున్నట్లుగా తెలియజేశాడు.

సోనూసూద్ రోడీస్ అనే సక్సెస్ ఫుల్ షో కొత్త సీజన్ కు హోస్ట్ గా చేయబోతున్నాడు. నా జీవితంలో ఇదో కొత్త అడ్వంచర్ అవ్వబోతుంది. ఈ అడ్వంచర్ లో ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను అనే నమ్మకం తో ఉన్నాను అన్నట్లుగా సోనూసూద్ చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరిని ఎంటర్ టైన్ చేసేందుకు నేను రెడీ.. ఈ జర్నీ మరింత అద్బుతంగా సాగడం కోసం ప్రతి ఒక్కరి సహకారం అవసరం అన్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.

సోనూసూద్ టీవీ షో రోడీస్ కు ఆయన అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈమద్య కాలంలో సోనూసూద్ క్రేజ్ మామూలుగా లేదు. ఆయన పేరు పడితే చాలు అన్నట్లుగా పరిస్థితి ఉంది. అలాంటిది ఈయన హోస్ట్ గా చేస్తే రోడీస్ కు ఏ స్థాయిలో ఆధరణ దక్కుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోనూ సూద్ కు మా తరపున మీ తరపున కూడా ఆల్ ది బెస్ట్.