‘జగన్ డబుల్ జల దోపిడీ చేస్తున్నారు..’ తెలంగాణ మంత్రి విమర్శలు

ఓ ముఖ్యమంత్రి తెలుగు గంగ పేరుతో నీళ్లు తరలిస్తే.. ఇప్పుడు కృష్ణా బేసిన్ పరిధిలోలేని నెల్లూరుకు నీళ్లు తరలిస్తామని సీఎం జగన్ అనడం సరికాదని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపుతున్న తరుణంలో మంత్రి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడుకు సీఎం జగన్ డబుల్ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఏపీతో మంచిగా ఉండాలన్నా వారు సహకరించట్లేదన్నారు.

పోతిరెడ్డిపై పోరాడిన పీజేఆర్ ను ఎన్నో అవమానాలకు గురిచేశారని అన్నారు. వైఎస్ సభలో పీజేఆర్ ను వేదికపైకి పిలవకపోవడంతో అక్కడే గుండెపోటుకు గురై ఆయన మరణించారన్నారు. ఆయన మరణానికి వైఎస్ కారణం కాదా? అని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో తెలంగాణకు నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో తీరని అన్యాయం జరిగిందని అన్నారు. వైఎస్ బతికుంటే తెలంగాణ వచ్చేది కాదని ఇప్పటికీ ప్రజలు మాట్లాడుకోవడం నిజం కాదా? అని అన్నారు. పాలమూరు-రంగారెడ్డికి ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో ఇచ్చారని మంత్రి అన్నారు.