మహేష్ – బాలయ్య సినిమాలపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్..!


టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలకి తనదైన శైలిలో కామెడీని జోడించి సూపర్ హిట్స్ అందుకుంటున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. ‘పటాస్’ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి అపజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్నాడు. ‘ఎఫ్ 2’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అనిల్.. గతేడాది ప్రారంభంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ‘ఎఫ్ 2’ ఫ్రాంచైజీలో విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ హీరోలుగా ‘ఎఫ్ 3’ సినిమా తెరకెక్కిస్తున్నాడు అనిల్. ఇప్పటికే 22 రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 27న రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా తర్వాత అనిల్ చేయబోయే ప్రాజెక్ట్ ఎంటనేది ఆసక్తికరంగా మారింది.

అనిల్ రావిపూడి తదుపరి సినిమా నందమూరి బాలకృష్ణతో ఉంటుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అలానే సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో బ్లాక్ బస్టర్ తీయడానికి రెడీ అవుతున్నాడని టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వీటిపై అనిల్ క్లారిటీ ఇచ్చాడు. మహేష్ – బాలకృష్ణ లను డైరెక్ట్ చేయబోతున్నారా? అని అడుగగా.. ఈ చిత్రాలన్నీ తప్పనిసరిగా పైప్ లైన్ లో ఉన్నాయని అనిల్ చెప్పుకొచ్చారు. అయితే అవన్నీ ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నాయని.. నా ఫోకస్ మొత్తం ఇప్పుడు ‘ఎఫ్ 3’ మీద మాత్రమే ఉందని.. ఈ సినిమా విడుదలైన తర్వాత నా తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాను అని అన్నారు. మహేష్ మరియు బాలయ్యలతో స్టోరీస్ పైప్ లైన్ లో ఉన్నాయి కానీ ఏ ప్రాజెక్ట్ గురించి ఇంకా కంఫర్మేషన్ లేదు అని అనిల్ రావిపూడి తెలిపారు.

కాగా సక్సెస్ ఫుల్ సినిమాలు తీస్తూ బస్టర్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారాడు. “గాలి సంపత్” అనే సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతో పాటు నిర్మాణంలో కూడా భాగం పంచుకుంటున్నాడు. రాజేంద్రప్రసాద్ – శ్రీవిష్ణు ప్రధాన పాత్రలతో అనీష్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా శివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.