తిరుపతిలో బీజేపీ గెలిస్తే.. అభ్యర్థికి బంపర్ ఆఫర్ ఇదేనట.!

2‌019 ఎన్నికల్లో ‘నోటా’ కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీ, ఈసారి ఏకంగా గెలిచేస్తానంటోంది. రెండేళ్ళలో ఆ పార్టీ అంతలా బలపడిపోయిందా.? నమ్మేలా వుందా ఇదేమన్నా.? ఎవరేమైనా అనుకోనీ, భారతీయ జనతా పార్టీ మాత్రం, రాష్ట్రంలో తాము చాలా బలంగా వున్నామని చెప్పుకుంటోంది. టీడీపీ కి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల్ని లాగేసుకోవడంలో సక్సెస్ అయిన బీజేపీ, ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యేనీ లాక్కోలేకపోయింది. ‘మేం అధికారంలోకి వస్తాం..’ అని బీజేపీ, ఆంధ్రపదేశ్ రాజకీయాల్లో హల్‌చల్ చేయడం చూస్తున్నాం.

ఇక, తిరుపతి ఉప ఎన్నికలో బంపర్ విక్టరీ సాధిస్తామని చెబుతోన్న బీజేపీ, ఈ క్రమంలో తమకు మిత్ర పక్షం జనసేన నుంచి పూర్తి మద్దతు లభిస్తుందనే నమ్మకం వుంది. ఇదిలా వుంటే, బీజేపీ నుంచి ఎవరు పోటీ చేసినా, గెలిస్తే గనుక.. ఆ వ్యక్తికి బీజేపీలో అత్యంత కీలక పదవులు దక్కబోతున్నాయట. కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్ కూడా వుంటుందట. తిరుపతికి ప్రత్యేకంగా కేంద్రం నుంచి నిధులు తెప్పించి, అభివృద్ధి చేసేస్తారట.. ఇదీ తిరుపతి ఉప ఎన్నిక విషయమై బీజేపీ నేతలు ఆఫ్ ది రికార్డుగా చేస్తున్న ప్రచారం.

ప్రస్తుతం బీజేపీ, అభ్యర్థి వేటలో పడింది. అదేంటీ, ఇప్పుడా అభ్యర్థిని వెతుక్కోవడం.? అంటే, అదంతే మరి. ‘ఇదేం చోద్యం.?’ అని ఎవరన్నా ప్రశ్నిస్తే, ‘మా పార్టీ నుంచి పోటీ చేయడానికి పెద్ద సంఖ్యలో అభ్యర్థున్నారు.. మాకు అభ్యర్థుల కొరత లేదు..’ అని బీజేపీ బుకాయించడం సర్వసాధారణమే. ప్రస్తుతం తెలంగాణకి చెందిన కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. ఏపీ నుంచి కేంద్ర మంత్రిగా ఎవరూ లేరు.

బీజేపీలో సీనియర్ నేతలు చాలామందే వున్నా, ఏపీలో తమకు ఓట్లు వచ్చే అవకాశం లేదు గనుక.. ఎవరికీ కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేకపోయింది బీజేపీ.. అన్నది సర్వత్రా విన్పిస్తోన్న విమర్శ. టీడీపీ – బీజేపీ కలిసి 2014 నుంచి 2018 వరకూ ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారం పంచుకున్న విషయం విదితమే. అప్పుడు జరగని అభివృద్ధి.. వచ్చే మూడేళ్ళలో బీజేపీ చేసేస్తుందా.?