పవన్ కోసం పాట వెంటపడిన త్రివిక్రమ్!

రివిక్రమ్ మాటల మాంత్రికుడు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆయన పాటల రచయిత కూడా అనే విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. సినిమాలకి మాటలతో పాటు పాటలను కూడా అందించిన కవులు .. రచయితలు కొంత మంది మాత్రమే కనిపిస్తారు. త్రివిక్రమ్ కూడా తాను మాటలు మాత్రమే కాదు .. పాటలు కూడా రాయగలనని నిరూపించుకున్నారు. మాటలు రాయడం ఇటుకపై ఇటుక పేర్చడం లాంటిది .. పాట రాయడమనేది ఒకేసారి పైకప్పు వేయడంలాంటిది. ఆ పనిలోనూ త్రివిక్రమ్ శభాష్ అనిపించుకున్నారు.

త్రివిక్రమ్ కొత్తగా పాటలు రాయడం ఇప్పుడు మొదలు పెట్టలేదు. 18 ఏళ్ల క్రితం రవితేజ హీరోగా వచ్చిన ‘ఒక రాజు ఒక రాణి’ సినిమాకి సింగిల్ కార్డుతో ఆయన పాటలు రాశారు. ఆ సినిమాలో ‘స్వరాల వీణ’ .. ‘వెన్నెలే నీవని’ అనే పాటలు ప్రేక్షకుల మనసులపై తేనె చిలకరించాయి. అయితే ఆ తరువాత మాటలు రాయడంలో త్రివిక్రమ్ బిజీ అయ్యారు. తాను పాటలు రాయగలని ఎవరితోను చెప్పలేదు .. తన సినిమాలకి రాసే ప్రయత్నం చేయలేదు .. తనకి ఆ టాలెంట్ కూడా ఉందనే విషయాన్ని హైలైట్ చేయలేదు.

మళ్లీ ఇంతకాలానికి ఆయన ‘మాట’ విడుపుగా పాట రాశారు .. అదీ పవన్ కోసం. పవన్ తాజా చిత్రంగా ‘భీమ్లా నాయక్’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పరంగా చివరిదశలో ఉంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ‘లాలా .. భీమ్లా’ అనే పాటను వదిలారు. పాత రికార్డులను పడగొడుతూ .. కొత్త రికార్డులను సెట్ చేస్తూ ఈ పాట దూసుకుపోతోంది. ఈ పాట రాసింది త్రివిక్రమ్ నే.

పవన్ కోరిక మేరకు త్రివిక్రమ్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే – మాటలు రాశారు. కథలోని సారం తనకి తెలియడం వలన ఈ పాట తాను రాస్తే బాగుంటుందని ఆయన అనుకున్నారో .. పవన్ వ్యక్తిత్వం తనకంటే బాగా ఎవరికి తెలుసు అనే ఆలోచనతో రాశారో గాని ఇప్పుడు ఈ పాట ఒక రేంజ్ లో మాస్ మనసులను పట్టుకుని వ్రేళ్లాడుతోంది. ‘పది పడగల పాముపైన పాదమెట్టిన సామి చూడు .. పిడుగులొచ్చి మీద పడితే కొండగొడుగునెత్తినోడు’ అంటూ ఈ కథలో నాయకుడు సాక్షాత్తు కృష్ణపరమాత్ముడు అనే ఉద్దేశంతో త్రివిక్రమ్ పదునైన సాహిత్యాన్ని అందించాడు. త్రివిక్రమ్ మాటల్లోనే కాదు .. ఆయన పాటల్లోను తీపి – తీవ్రత కలిసిపోయి కనిపిస్తుండటం విశేషం.