మరోసారి తెరమీదకు ‘త్రివిక్రమ్ – దేవిశ్రీ’ కాంబో..?

తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడు త్రివిక్రమ్ – సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ గురించి అందరికి తెలిసిందే. ప్రేక్షకులు ఒకరిని మాటల మాంత్రికుడని.. మరొకరిని రాక్ స్టార్ అంటూ పిలుచుకుంటారు. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్ రూపొందిన మ్యూజిక్ ఆల్బమ్స్ అన్నికూడా సూపర్ హిట్ అయ్యాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాతో త్రివిక్రమ్ – దేవిశ్రీ రాపో మొదలయింది. మొన్నటి ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమా వరకు విజయవంతంగా కొనసాగింది. జులాయి సినిమా నుండి వీరి కాంబినేషన్ మారలేదు.

‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ టైంలో ఏమైందో గానీ త్రివిక్రమ్ – దేవిశ్రీ కలయికలో మరో సినిమా రాలేదు. అప్పటినుండి ఇండస్ట్రీలో ఇద్దరి మధ్య సఖ్యత చెడిందని అందుకే ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారు అంటూ టాక్ నడిచింది. అది నిజమే అన్నట్టుగా త్రివిక్రమ్ అఆ సినిమాకు మిక్కీ.జే మేయర్ ను తీసుకున్నాడు. అందరూ దేవిశ్రీ బిజీ ఉన్నాడేమో అందుకే ఇలా అనుకున్నారు. కానీ ఆ తర్వాత అజ్ఞాతవాసి సినిమాకు కూడా దేవిశ్రీ రాలేదు. అనిరుధ్ లైన్ లోకి వచ్చేసరికి జనాల అనుమానం కన్ఫర్మ్ అయింది. అనంతరం అరవిందసమేత అల వైకుంఠపురంలో సినిమాలకు తమన్ సంగీతం అందించాడు.

ప్రస్తుతం జనాలు కూడా తమన్ – త్రివిక్రమ్ కాంబినేషన్ కూడా బాగా ఇష్టపడుతున్నారు. అయితే తాజాగా దేవి – త్రివిక్రమ్ మధ్య సఖ్యత బాగానే ఉందంటూ మళ్లీ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ మధ్యలో ‘రంగ్ దే’ ప్రీ-రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ – దేవి కలుసుకున్నారు. ఈ సందర్బంగా స్టేజిపై దేవిని త్రివిక్రమ్ పొగడటం దేవి త్రివిక్రమ్ కు ‘లవ్ యూ’ చెప్పడం చూస్తే వారి మధ్య ఏమిలేదని అర్ధమవుతుంది. ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా ప్రకటించాడు. ఈ సినిమాకు సంగీతం విషయంలో తమన్ పేరు బాగానే వినిపించింది. కానీ మళ్లీ మణిశర్మ పేరు తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం మణిశర్మ అని టాక్ నడుస్తుంది. కానీ ఓవైపు త్రివిక్రమ్ – దేవిశ్రీ కాంబో సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట. చూడాలి మరి ఫైనల్ ఎవరు అవుతారో..!