విజయ్ దేవరకొండ తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి గ్యాప్ తీసుకోలేదు. చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులపై ఆయన చూపించిన ప్రభావం ఎక్కువ. అందువలన ఫ్లాపులు ఆయన కెరియర్ పై పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. విజయ్ దేవరకొండ పైకి చాలా రఫ్ గా కనిపించినా సమయాన్ని వృథా చేసే టైప్ కాదు. ఒక సినిమా తరువాత ఒక సినిమాను చకచకా లైన్లో పెట్టేస్తుంటాడు. అయితే కరోనా కారణంగా ‘లైగర్’ విషయంలో మాత్రం గ్యాప్ వచ్చేసింది. ఈ సినిమా కోసం ఆయన రెండేళ్ల సమయాన్ని కేటాయించవలసి వచ్చింది.
నిజానికి పూరి కూడా నాన్చే రకం కాదు .. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేద్దామనే ఉద్దేశంతో కరణ్ జొహార్ రంగంలోకి దిగకపోయినా కరోనా కాళ్లు అడ్డం పెట్టకపోయినా ఈ పాటకి మూడు సినిమాలు తీసేసి ఉండేవాడు. ఇద్దరూ ఈ ప్రాజెక్టు పై ఇంత శ్రద్ధ పెట్టి పనిచేయడానికి మరో కారణం ఈ కంటెంట్ పై ఉన్న నమ్మకమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తరువాత తన కెరియర్ మరో స్థాయి గ్రాఫ్ ను చూపించనుందనే ఆశతోనే విజయ్ దేవరకొండ వెయిట్ చేస్తున్నాడు. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ రేంజ్ ఆకాశం దిశగా దూసుకుపోయినట్టు విజయ్ దేవరకొండ కూడా ఒక రాకెట్ లా మారిపోతాడేమో.
ఇక విజయ్ దేవరకొండని చూసిన ఎవరికైనా ఆయన ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోడనే విషయం అర్థమైపోతుంది. అలాగే పూరి కూడా ఎలాంటి టెన్షన్స్ తీసుకోకుండా కూల్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. విజయ్ దేవరకొండకి యూత్ తో పాటు మాస్ లోను మంచి ఇమేజ్ ఉంది. మరింత మాస్ ఇమేజ్ ఇవ్వగలిగే సత్తా పూరికి ఉంది. అందువల్లనే ఈ ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడింది. ఒకరిపై ఒకరికి ఒక దర్శకుడు .. హీరో మధ్యకి మించిన సాన్నిహిత్యం ఏర్పడిపోయింది. అందువల్లనే ఈ ఇద్దరూ కలిసి మరో పాన్ ఇండియా సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు.
విజయ్ దేవరకొండ దగ్గర మైత్రీ మూవీస్ వారి అడ్వాన్స్ ఉంది .. అలాగే ఆయనతో సినిమా చేయడాకి శివ నిర్వాణ సిద్ధంగా ఉన్నాడు. సహజంగానే శివ నిర్వాణ సినిమాల్లో లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి కథనే ఆయన విజయ్ దేవరకొండ కోసం రెడీ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. అందువలన విజయ్ దేవరకొండ ముందుగా శివ నిర్వాణ సినిమాను చేసి పూరి మళ్లీ తన సెటప్ రెడీ చేసుకున్నాక అటు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక సురేందర్ రెడ్డి .. హరీశ్ శంకర్ వంటి దర్శకులు విజయ్ దేవరకొండతో సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారనే టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది.