‘అరేయ్.. నువ్వు చేసింది సరిపోలేదారా’.. మరో వీడియోతో వచ్చిన విశ్వక్..!

టాలీవుడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఓ ప్రాంక్ వీడియో.. ఇప్పుడు పెద్ద వివాదానికి కారణమైంది. ఇప్పటి వరకు మీడియా – సోషల్ మీడియాలోనే దుమారం రేపిన ఈ వ్యవహారం.. ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం వరకూ వెళ్ళింది.

‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం ప్లాన్ చేసిన ప్రాంక్ వీడియోలో విశ్వక్ సేన్ భాగమయ్యారు. కొత్త సినిమా విడుదల రోజు థియేటర్స్ వద్ద రివ్యూలు ఇస్తూ హంగామా చేసే ఓ యువకుడు.. ఫిల్మ్ నగర్ రోడ్డుపై విశ్వక్ కారుకు అడ్డంగా పడుకొని సూసైడ్ ప్రాంక్ వీడియో చేశారు. పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్ చేసారంటూ నెటిజన్లు విశ్వక్ సేన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారం హీరో విశ్వక్ సేన్ పై చర్యలు తీసుకోవాలంటూ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసే వరకూ వెళ్లింది. ఈ క్రమంలో దీనిపై టీవీ9 న్యూస్ ఛానల్ డిబేట్ కు వెళ్లడం.. విశ్వక్ సేన్ ను పాగల్ సేన్ అని యాంకర్ సంబోధించడం.. అసభ్యకరమైన ఎఫ్ పదంతో విశ్వక్ దూషించడం.. గెటవుట్ అంటూ విశ్వక్ పై యాంకర్ ఫైర్ అవ్వడం.. ఇదంతా వివాదంగా మారడం జరిగిపోయాయి.

ఇంతటి వివాదానికి కారణమైన ప్రాంక్ వీడియోపై ఒంటిపై పెట్రోలు పోసుకున్నట్టుగా హడావిడి చేసిన లక్ష్మణ్ పై విశ్వక్ సేన్ ఫన్నీగా కామెంట్స్ చేసిన ఓ వీడియో బయటకు వచ్చింది. ‘బ్రో.. అర్జున కుమార్ అల్లం ఎక్కడో ఇప్పటికైనా చెప్పు బ్రో’ అంటూ హంగామా చేయగా.. ‘అరేయ్.. నువ్ చేసింది సరిపోలేదారా’ అంటూ విశ్వక్ ఫన్ క్రియేట్ చేశారు.

‘నువ్వు ఏదైనా గోల చేసేది ఉంటే 6వ తారీఖున థియేటర్ వద్ద చెయ్.. లేదా థియేటర్ లోపల చెయ్.. ఇలా చేస్తే నన్ను ఏసుకుంటారు’ అని విశ్వక్ సేన్ సరదాగా అనడం గమనించవచ్చు. అయితే ఇది కూడా ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ మూవీ ప్రమోషన్స్ కోసమే చేశారేమో అనే సందేహం కలుగుతోంది.

ఇకపోతే లైవ్ లో ‘ఎఫ్’ అనే పదాన్ని ఉపయోగించడంపై విశ్వక్ సేన్ మీడియా ముందు క్షమాపణలు చెప్పినా.. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడలేదు. స్టూడియోలో జరిగిన వ్యవహారం పై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి యాంకర్ దేవి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో తగిన చర్యలు తీసుకుంటానని మినిస్టర్ హామీ కూడా ఇచ్చారు.

నేనూ చూసాను.. విశ్వక్ సేన్ రోడ్డు పై న్యూసెన్స్ చేయడం.. అతని ప్రవర్తన ఏమి బాగాలేదు. నా ఇష్టం వచ్చినట్లు చేస్తా.. రోడ్డు మీద ప్రాంక్ చేస్తా.. మీడియా ముందు బూతులు మాట్లాడతా అంటే కుదరదు. అతనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఈ విషయమై మా అసోసియేషన్ తో మాట్లాడతాను అని మంత్రి తలసాని అన్నారు.

దీంతో ఈ వివాదం విశ్వక్ సేన్ కెరీర్ ను నాశనం చేస్తుందేమో అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది. ఒకవేళ అతని పై చర్యలు తీసుకుంటే మాత్రం.. ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న విశ్వక్ కి సమస్యలు వచ్చి పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అదే సమయంలో సోషల్ మీడియాలో విశ్వక్ కు మద్దతు లభిస్తోంది. విశ్వక్ పై చర్యలు తీసుకుంటే.. దానికి కారణమైన న్యూస్ ఛానల్ మరియు యాంకర్ పై కూడా యాక్షన్ తీసుకోవాలని.. విశ్వక్ పై యాంకర్ చేసిన వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.
https://youtu.be/5SDZcxYRZHc