వైసీపీ ఎమ్మెల్యే ఘోరావ్

ఏపీలో అధికార పార్టీకి చెందిన పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ కు చేదు అనుభవం ఎదురైంది. వేపగుంట ముత్యమాంబ పండుగలో స్టేజీ ఏర్పాటుకు ముందుగా అనుమతించి, తర్వాత రద్దు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి కారణం అదీప్ రాజ్ అని ఆరోపిస్తూ ఆయన వాహనాన్ని అడ్డగించి ఘోరావ్ చేశారు. గ్రామ దేవత పండగ విషయంలో రాజకీయాలు చేస్తారా అని నిలదీశారు. స్థానిక యువకులు ఆయన్ను దుర్భాషలాడారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కొందరు స్థానికులు జోక్యం చేసుకుని యువకులకు సర్దిచెప్పారు. అనంతరం ఎమ్మెల్యేను అక్కడ నుంచి పంపించేశారు.

వేపగుంట ముత్యమాంబ పండగకు సంబంధించి ఉత్సవ కమిటీ మూడు స్టేజీలు ఏర్పాటు చేయగా.. టీడీపీ వర్గీయులు ఒక స్టేజీ ఏర్పాటు చేశారు. సంబంధిత శాఖల నుంచి అన్ని అనుమతులు తెచ్చుకుని వీటిని ఏర్పాటు చేయగా.. అధికారులు వాటిని అడ్డుకున్నారు. స్టేజీల ఏర్పాటుకు అనుమతులు లేవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గురువారం వేపగుంట వైపు వెళ్తున్న ఎమ్మెల్యే వాహనాన్ని ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక యువకులు అడ్డుకుని ఘోరావ్ చేశారు. స్టేజీల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాల్సిందేనని వారు పట్టుబట్టగా.. ఇప్పుడు ఇక కుదరదని ఎమ్మెల్యే చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో స్థానికులు కలుగచేసుకుని ఎమ్మెల్యేను అక్కడ నుంచి పంపించేశారు.