‘నా భర్త ఎక్కడ.?’ అంటూ భర్తను వరదల్లో కోల్పోయిన ఓ అభాగ్యురాలు కన్నీరు మున్నీరవుతోంది. ‘మా ఊరు జల సమాధి అయిపోయింది..’ అంటూ పలువురు గ్రామస్తులు ఆర్తనాదాలు చేస్తున్నారు. తినడానికి తిండి లేదు.. తాగడానికి నీరు లేదంటూ వరద బాధితులు లబోదిబోమంటున్నారు.
ఇంతకీ, ప్రభుత్వం ఎక్కడ.? బాధితుల్ని ఆదుకోవడం కంటే, అధికార పార్టీ నాయకులు పబ్లిసిటీ స్టంట్లకే పరిమితమవుతున్నారన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ విషయమై రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం కాదు, బాధితులే.. నాయకుల్ని నిలదీస్తున్నారు.
సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన బాధితులకు సహాయం అందాల్సి వుంది. ‘బాధితుల్ని ఆదుకోవాలి..’ అంటూ పాలకులకు, అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కాదు. సాయం అందుతోందా.? లేదా.? అన్నదానిపై గ్రౌండ్ లెవల్లో వాస్తవాల్ని తెలుసుకోగలగాలి.
‘మేం ఉద్ధరించేస్తున్నాం..’ అని పబ్లిసిటీ స్టంట్లు చేసుకోవడం తప్ప, బాధితుల్ని పాలకులు ఆదుకుంటున్న పరిస్థితి లేదు. గోరు చుట్టు మీద రోకలి పోటు చందాన.. మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం వుండడంతో చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటోంటే, వారిని ఆదుకునే నాధుడే కరవయ్యాడు.
తుపాను, వరద బాధిత కుటుంబాలకు పది వేలు చొప్పున ఇవ్వాలంటూ ప్రతిపక్షంలో వున్నప్పుడు నినదించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక.. ఏం చేస్తోంది.? ప్రజల్ని ఎలా ఆదుకుంటోంది.? అన్న విషయమై సామాజిక మాధ్యమాల్లో పడుతున్న సెటైర్లు చూశాక అయినా, పాలకులకు కనువిప్పు కలగకపోవడం శోచనీయం.
ప్రతిపక్ష నేత చంద్రబాబు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇతర విపక్షాలకు చెందిన నాయకులూ బాధితుల్ని ఆదుకునేందుకు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. కానీ, ముఖ్యమంత్రి ఎక్కడ.? మంత్రులు ఏం చేస్తున్నారు.? ఈ విషయమై బాధిత ప్రజానీకమే నిలదీస్తున్నారాయె.