రేటు.. హీటు.. సినీ ప్రేక్షకుల కోసం ‘ఉద్ధరణ’ పథకం.!

పాపం సినిమా ప్రేక్షకులు.. ఎక్కువ ధర పెట్టి సినిమా టిక్కెట్ కొనలేకపోతున్నారు. అందుకే, సినిమా టిక్కెట్ ధరల్ని అందుబాటులోకి తెస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇకపై చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఒకటే టిక్కెట్ ధర. అంతేనా, అదనంగా షోలు వేసుకోవడానికి కూడా అవకాశం లేదు.

నిజానికి మంచి నిర్ణయమే ఇది. సినీ ప్రేక్షకులపై టిక్కెట్ల భారం దారుణంగా తయారైంది. పెద్ద సినిమాల పేరు చెప్పి అడ్డంగా దోచేస్తున్నాయి థియేటర్ల యాజమాన్యాలు. నిర్మాతలు ప్రభుత్వాల్ని ఆశ్రయించి తొలి రోజు లేదా రెండు మూడు రోజులు లేదా తొలి వారం టిక్కెట్ ధరల్ని పెంచుకునేందుకు అనుమతి తెచ్చుకోవడం ఆనవాయితీగా వుంది. ఆ ధరల్ని మించి బ్లాక్ మార్కెట్ చేసేసి ప్రేక్షకుల్ని నిలువునా దోచేస్తున్న థియేటర్ల యాజమాన్యాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

మరిప్పుడు, ఆ థియేటర్ల యాజమాన్యాలు ఏం చేయబోతున్నాయి.? ఆ సంగతి పక్కన పెడితే, పెద్ద నిర్మాతలకు మాత్రం ప్రభుత్వ నిర్ణయం ఎదురుదెబ్బే. ఇకపై పెద్ద సినిమాలనేవి వుండకపోవచ్చు.. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో. అసలు ఇప్పుడు నిర్మాణంలో వున్న పెద్ద సినిమాలు ఎలా విడుదలవుతాయో ఏమో.!

తొలి రోజు ఐదు షోలు, ఆరు షోలు వేసుకునే పరిస్థితి గతంలో వుండేది. ఇకపై ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వుండదు. బెనిఫిట్ షోలు కూడా వుండవ్. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని అసెంబ్లీ సాక్షిగా వెల్లడించింది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయ్.. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తగ్గించదుగాక తగ్గించదు. టమోటా సహా కూరగాయల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయ్.. కానీ, వాటిని తగ్గించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయదు.

నిజానికి, రెగ్యులేట్ చేయాల్సిన విషయాలు చాలా వున్నాయి. అవన్నీ మానేసి సినిమా అనే చిన్న పరిశ్రమ మీద ప్రభుత్వం ఎందుకు ఫోకస్ పెట్టినట్టు.? ఎవర్ని టార్గెట్ చేశారోగానీ ప్రభుత్వ పెద్దలు, మొత్తంగా తెలుగు సినీ పరిశ్రమ ఈ దెబ్బతో ఖతం అయ్యే పరిస్థితులేర్పడ్డాయనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.