జస్ట్ ఆస్కింగ్: సీఎం జగన్ హత్యకు కుట్ర జరుగుతోందా.?

చాలా చాలా సున్నితమైన అంశమిది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని అధికార వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఓ ఎమ్మెల్యే, తాజాగా ఓ మంత్రి.. తమ అధినేతపై హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.

మొన్నీమధ్యనే ఓ సందర్భంలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు, ‘గాల్లోనే వస్తాడు.. గాల్లోనే పోతాడు..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో ఈ దుమారం చెలరేగింది. వరద బాధితుల్ని పరామర్శించే క్రమంలో వైఎస్ జగన్ హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసి వెళ్ళిపోయారు తప్ప, నేల మీద దిగి బాధితుల్ని పరామర్శించలేదన్నది నారా చంద్రబాబునాయుడి ఉద్దేశ్యం.

సరే, వైఎస్ జగన్ ఎప్పుడు పదవిలోంచి దిగిపోతారా.. ఆ పదవిలో తానెప్పుడు కూర్చోవాలా.. అని చంద్రబాబు ఎదురుచూస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. గతంలో చంద్రబాబుని దించేసేందుకు వైఎస్ జగన్ కూడా నానా ప్రయత్నాలూ చేశారు. ఈ క్రమంలో చంద్రబాబుని నడి రోడ్డు మీద కాల్చేసినా, ఉరి తీసినా తప్పు లేదంటూ జగన్ కూడా మితి మీరి వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి.

చంద్రబాబు కూడా అలాగే మాట తూలారు. అంతమాత్రాన, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హత్యకు చంద్రబాబు అండ్ టీమ్ కుట్ర పన్నుతున్నారని అనగలమా.? పైగా, చంద్రబాబు సామాజిక వర్గం చందాలు పోగేసి మరీ, వైఎస్ జగన్ కుట్రకు ప్రయత్నిస్తోందని అధికార పార్టీ ఆరోపిస్తోంది.

ఇక్కడ కుల ప్రస్తావన ఎందుకు వస్తోంది.? వైసీపీలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు లేరా.? చిత్ర విచిత్రమైన, అతి చెత్త రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నడుస్తున్నాయి. ఆ రాజకీయాలు హద్దులు దాటి, హత్యా రాజకీయాల గురించి మాట్లాడుతూ, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తుండడమే బాధాకరం.