జగన్ సర్కార్‌కి షాక్: ఏపీలో పంచాయితీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

షాకుల మీద షాకులు.. మళ్ళీ మళ్ళీ షాకులు.. ప్రభుత్వం తరఫున వితండవాదం తెరపైకొస్తే ఏం జరుగుతుంది.? న్యాయస్థానాల్లో షాకులు తప్పవ్ మరి. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వానికి ఊరట కలిగిందనీ.. ఎస్ఈసీకి షాక్ తగిలిందనీ వైసీపీ పండగ చేసుకుంది. ఇకనైనా ఎస్ఈసీ బాద్యతాయుతంగా వ్యవహరించాలంటూ వైసీపీ నేతలు.. మరీ ముఖ్యంగా మంత్రులు ఎద్దేవా చేశారు.

మరిప్పుడు, హైకోర్టు తీర్పుని మంత్రలు గౌరవిస్తారా.? ఇంకా ఎస్ఈసీపై విమర్శలు కొనసాగిస్తారా.? న్యాయస్థానాలకు దురుద్దేశాలు ఆపాదించడాన్ని వైసీపీ నేతలు ఆపుతారా.? ఏమోగానీ, హైకోర్టు తాజా తీర్పుతో రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రజారోగ్యం, ఎన్నికలు.. రెండూ ముఖ్యమేననీ, ప్రభుత్వం – ఎస్ఈసీ సమన్వయంతో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదలయ్యింది. అయితే, కరోనా వ్యాక్సినేషన్ నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ ప్రభుత్వం, న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం (సింగిల్ బెంచ్), ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

అయితే, సింగిల్ బెంచ్ తీర్పుని ఎస్ఈసీ సవాల్ చేసింది. ఎస్ఈసీ రిట్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఈసారి ప్రభుత్వానికి షాకిచ్చింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, ఆ ప్రక్రియ స్థానిక ఎన్నికలకు ఇబ్బంది కలిగించబోదని ఎస్ఈసీ తరఫు వాదనలు బలంగా న్యాయస్థానంలో వినిపించారు న్యాయవాది. అయితే, ఎన్నకిల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రభుత్వం సహకరిస్తుందా.? లేదా.? అన్నది మాత్రం ప్రస్తుతానికైతే సస్పెన్సే.

ఎందుకంటే, నిమ్మగడ్డ హయాంలో స్థానిక ఎన్నికల నిర్వహణ అధికార పార్టీకి అస్సలేమాత్రం ఇష్టం లేదు. ఉద్యోగుల్ని సైతం, ఎస్ఈసీకి వ్యతిరేకంగా నినదించేలా ఉసిగొల్పుతోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. అధికార పార్టీకి చెందిన రాజకీయ కార్యక్రమాలకీ, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన కార్యక్రమాలకీ పెద్దయెత్తున జనాన్ని సమీకరిస్తున్నా లేని కరోనా భయం, స్థానిక ఎన్నికల విషయంలోనే ఎందుకు.? అన్న ప్రశ్నకు అధికార పార్టీ వద్ద, ప్రభుత్వ పెద్దల వద్ద సమాధానమే లేని పరిస్థితి.