వైఎస్ జగన్ సర్కారు, రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల్ని వ్యతిరేకిస్తోంది. కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన పని తాను చేసుకుపోతోంది. అయితే, ప్రభుత్వ సహకారం లేకుండా పంచాయితీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. ప్రభుత్వంతో, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి సహాయం అందించేలా చేయాల్సిన బాధ్యతను సర్వన్నత న్యాయస్థానమో, ఇంకో వ్యవస్థో తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నది రాజకీయ విశ్లేషకుల, న్యాయ నిపుణుల వాదన. ఇదిలా వుంటే, కరోనా నేపథ్యంలో పంచాయితీ ఎన్నికలు సబబు కాదని ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. బులుగు మీడియాది కూడా ఇదే వాదన.
ఉద్యోగులు, ప్రభుత్వం, అధికార పార్టీ.. వ్యవహారాలు పక్కన పెడితే, బులుగు మీడియా అత్యుత్సాహం.. అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. బులుగు మీడియాకి చెందిన ఓ పత్రికలో ఈ రోజు జిల్లాల ఎడిషన్లను తీసుకుంటే, వాటిల్లో ‘పంచాయితీతో ప్రాణ సంకటం’ అంటూ కథనాల్ని వండి వడ్డించేశారు. ‘నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.?’ అన్న చందాన, ఆ కథనాల కిందనే, ‘వనమే జనమై..’, ‘బోనాల సందడి..’ అంటూ పెద్దయెత్తున జనం గుమికూడి వున్న ఫొటోల్ని, ఆయా వేడుకలు, ఉత్సవాలు, పర్యాటక ప్రాంతాల కళకళలల గురించి ఫొటోలతో కూడిన కథనాల్ని ప్రచురించారు. అంటే, కేవలం పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తేనే.. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుందా.? ఇతరత్రా కార్యక్రమాల పేరుతో అధికార పార్టీ పబ్లిసిటీ స్టంట్లు చేస్తే కరోనా రాదా.? బులుగు మీడియా ఏం చెప్పాలనుకుంటోంది.! ఇక్కడ బులుగు మీడియా కథనాలతో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తింటోంది. అధికార పార్టీ పరువు కూడా పోతోంది.
తమ వాదన ఏంటి.? బులుగు మీడియాలో వస్తున్న కథనాలేంటి.? అంటూ అధికార పార్టీ నేతలు నెత్తీ నోరూ బాదుకుంటున్నారో లేదోగానీ.. ప్రజలైతే మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు. ‘కరోనా నేపథ్యంలో మద్యం షాపుల వద్ద ప్రమాదకరమైన పరిస్థితుల్లో డ్యూటీలు చేయడానికి భయపడని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాస్వామ్య ప్రక్రియ అయిన ఎన్నికల నిర్వహణ పట్ల భయపడటమేంటి.?’ అన్న ప్రశ్న కాస్తంత తెలివి వున్నవారెవరికైనా కలుగుతుంది. దురదృష్టం.. రాష్ట్రంలో కాస్త తెలివితో ఆలోచించేవారెవరూ లేరన్న భ్రమల్లో అధికార పార్టీ కొట్టుమిట్టాడుతున్నట్టుంది.. ఆ అతి తెలివిని అచ్చంగా బులుగు మీడియా ప్రదర్శించేస్తోందన్నమాట.