తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక: డిపాజిట్లు రావట.. నిజమేనా.!

పంచాయితీ, మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకీ, లోక్‌సభ ఉప ఎన్నికలకీ చాలా తేడా వుంది. కానీ, అధికార వైసీపీ మాత్రం, ‘ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు కూడా రావు. అసలు అభ్యర్థులే దొరకరు..’ అంటోంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. తెలంగాణలో తమకు ఎదురే లేదని విర్రవీగిన అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి లోక్‌సభ ఎన్నికలు గట్టి షాకే ఇచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ పుంజుకున్నాయి లోక్ సభ ఎన్నికల్లో. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏం జరిగిందో చూశాం.

విపక్షాల్లో ఏ రాజకీయ పార్టీ ఎంత సమర్థవంతంగా తిరుపతి ఉప ఎన్నిక కోసం సన్నద్ధమవుతుందన్నది వేరే చర్చ. అధికార పార్టీకి ఈ ఉప ఎన్నిక కత్తి మీద సాము లాంటిదే. తిరుపతి కార్పొరేషన్‌ని తిరుగులేని మెజార్టీతో దక్కించుకుంది వైసీపీ. ఆ లెక్కన, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాన్ని కూడా అదే స్థాయిలో గెలుచుకోగలిగితేనే.. రాష్ట్రంలో వైసీపీ చెప్పుకుంటున్న ‘సంక్షేమం – అభివృద్ధి గెలిచింది’ అన్న మాటకు అర్థం వుంటుంది. ఇదిలా వుంటే, మునిసిపల్ ఎన్నికల్లో ఎలాగైతే, చెత్త రాజకీయాలు చేసి, వైసీపీ గెలుపులో కీలక భూమిక పోషించిందో, అదే సైంధవ పాత్ర తిరుపతి ఉప ఎన్నిక సందర్బంగా కూడా టీడీపీ, టీడీపీ అను‘కుల’ మీడియా పోషించే అవకాశాల్లేకపోలేదు. ‘తిరుపతి ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది..’ అంటూ టీడీపీ అను‘కుల’ మీడియా గ్రూపుకి చెందిన ఓ ఛానల్ తేల్చేసింది.

‘ఆ అవకాశమే లేదు’ అని జనసేన నేత చెబితే, ‘జనసేన నేత భరోసా ఇస్తున్నారు.. తిరుపతి ఉప ఎన్నిక ఏకగ్రీవం కాబోదట..’ అంటూ వెటకారం చేశాడొక సీనియర్ జర్నలిస్టు. ఇలా తయారైంది రాష్ట్రంలో టీడీపీ రాజకీయం. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం వైసీపీకి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కానీ, లోక్‌సభ నియోజకవర్గమది. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం మీదనే అంత ఫోకస్ పెట్టిన బీజేపీ, తిరుపతి లోక్‌సభ మీద ఇంకెంత ఫోకస్ పెడుతుంది.? పెట్టకపోతే మాత్రం, వైసీపీ – బీజేపీ మధ్య అవగాహన నిజమేనని తేలిపోతుంది.