అపరిచితులు జగనన్న, చంద్రన్న.. ఇదేం ట్విస్ట్‌ మహాప్రభో.!

కొత్త వ్యవసాయ చట్టాలకు పార్లమెంటులో ఆమోదం లభించినప్పుడు, కేంద్రంలోని మోడీ సర్కార్‌కి అండగా నిలిచాయి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు. టీడీపీ, వైసీపీ.. ఈ రెండూ కలిసి కేంద్రానికి మద్దతిచ్చిన విషయం విదితమే. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్యా ఆ వ్యవసాయ చట్టాల విషయమై రచ్చ జరుగుతోంది. ఒకర్నొకరు తిట్టుకుంటున్నారు.

‘టీడీపీకి ఆ నైతిక హక్కు లేదు..’ అని వైసీపీ విమర్శిస్తోంది. ‘వైసీపీకి ఆ హక్కు లేదు..’ అంటూ టీడీపీ ఎద్దేవా చేస్తోంది. చంద్రన్న, జగనన్న.. ఇద్దరూ ఈ విషయంలో ఒక్కటే. ఒకరు ఎక్కువా కాదు, ఒకరు తక్కువా కాదు.!

రైతుల ఆందోళనలకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మద్దతు పలికింది. వారికి సంఘీభావం కూడా తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వమే స్వచ్ఛందంగా బంద్‌కి సహకరిస్తోంది. ఇది నిజంగానే చిత్ర విచిత్రమైన సందర్భం. మంత్రి కన్నబాబు ఈ విషయాన్ని నిన్న వెల్లడించారు. అప్పుడు వ్యవసాయ చట్టాలకు మద్దతిచ్చి, ఇప్పుడిలా రివర్స్‌ గేర్‌ వేయడమేంటి.? రాజకీయ విశ్లేషకుల్ని సైతం షాక్‌కి గురిచేస్తోంది టీడీపీ, వైసీపీ ‘అపరిచిత’ వైఖరి.

ప్రధానంగా అధికారంలో వున్న పార్టీ, ఇలా ప్లేటు ఫిరాయించడంతో జనం సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. అమరావతి రైతులు ఏడాదిగా ఆందోళనలు చేస్తున్నా, వరదల ధాటికి రైతులు విలవిల్లాడుతున్నా పట్టించుకోని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, వ్యవసాయ చట్టాల విషయమై రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతివ్వడమేంటి.?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకించడమంటే.. అది కొంతవరకు సబబే. ఎందుకంటే, టీఆర్‌ఎస్‌.. పార్లమెంటులో మోడీ సర్కార్‌కి వ్యతిరేకంగా వ్యవహరించింది. ఆ సమయంలోనే, వైఎస్సార్సీపీపైనా, టీడీపీపైనా రైతుల పరంగా ఒత్తిడి వున్నా.. ఆ రెండు పార్టీలూ మోడీ సర్కార్‌కి భయపడి, పార్లమెంటులో వ్యవసాయ చట్టాలకు మద్దతివ్వక తప్పలేదు. ఇప్పుడు కూడా గట్టిగా వ్యతిరేకించలేకపోతున్నాయి టీడీపీ, వైసీపీ.. వ్యవసాయ చట్టాల్ని. రైతులకు మాత్రం సంఘీభావం ప్రదర్శిస్తున్నాయంతే.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని దగుల్బాజీ రాజకీయాలు ఇవంటూ నెటిజన్లు టీడీపీ, వైసీపీలను తిట్టిపోస్తున్నారు.