ఖమ్మం ‘సంకల్ప సభ’లో షర్మిల ఏం చెప్పబోతున్నారు.?

జై తెలంగాణ నినాదం తప్పనిసరి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన గురించి, ఆ పాలన గొప్పతనం గురించీ నినదించడం మామూలే. ఇంతకీ, ఆంధ్రపదేశ్ గురించి ఖమ్మం సంకల్ప సభలో వైఎస్ షర్మిల ఏం చెప్పబోతున్నారు.? షర్మిల సంగతి సరే, వైఎస్ విజయా రాజశేఖర్ రెడ్డి (విజయమ్మ) ఏం మాట్లాడబోతున్నారు.? ఇప్పడీ ప్రశ్నలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్స్ అయ్యాయి. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించనున్న షర్మిల, ఇందుకోసం గత కొద్ది నెలలుగా కసరత్తులు చేస్తోన్న విషయం విదితమే.

ఎక్కడా తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటో లేకుండా జాగ్రత్త పడుతున్న షర్మిల, తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తాననే ధీమా మాత్రం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో చాలామంది షర్మిల పార్టీని లైట్ తీసుకున్నా, క్రమక్రమంగా నేతలు షర్మిల వైపు వెళుతోంటే ఆయా పార్టీల్లో కొంత ఆందోళన అయితే కన్పిస్తోంది. మరీ ముఖ్యంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, షర్మిల పార్టీ వ్యవహారాలపై ప్రత్యేక నిఘా వుంచినట్లే తెలుస్తోంది. కాస్సేపటి క్రితం షర్మిల హైద్రాబాద్ నుంచి భారీ కాన్వాయ్ తీశారు. పెద్దయెత్తున కార్లు, బైకులు ఈ ర్యాలీలో కనిపిస్తున్నాయి. ఖమ్మం వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. మధ్యమధ్యలో షర్మిల కాన్వాయ్ కోసం ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు కూడా చేశారు షర్మిల అభిమానులు.

ఆంధ్రపదేశ్ ప్రస్తావన లేకుండా తెలంగాణలో రాజకీయం చేయడం అంత తేలిక కాదు. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో అధికారంలో వున్నది స్వయానా తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎందాకైనా వెళతానంటున్న షర్మిల, ఈ క్రమంలో తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనూ రాజకీయంగా ఢీకొనాల్సి వస్తుందా.? అన్న చర్చ జరగడం సహజమే. అయితే, ఇదంతా ఓ పొలిటికల్ డ్రామా అనీ.. స్వయంగా వైఎస్ జగన్, షర్మిలను వెనకుండి నడిపిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు.