విద్యార్థుల ప్రాణాల కన్నా, సర్టిఫికెట్లలో మార్కులే ముఖ్యమా.?

‘పరీక్షలు నిర్వహించకుండా, విద్యార్థుల్ని ప్రమోట్ చేస్తే, సర్టిఫికెట్లలో పాస్ అని మాత్రమే వుంటుంది.. సరైన మార్కులు లేకపోతే, ఉద్యోగాలెలా వస్తాయ్.? ప్రతి ఉద్యోగికీ భరోసా ఇస్తున్నా.. విద్యార్థుల గురించి నాకన్నా బాగా ఎవరూ ఆలోచించలేరు..’ అంటూ పదో తరగతి పరీక్షల విషయమై తన మనసులో మాటని ఇంకోసారి స్పష్టంగా బయటపెట్టేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

నైట్ కర్ఫ్యూలు, మినీ లాక్ డౌన్ వ్యవహారాలు.. పెళ్ళిళ్ళు, అంత్యక్రియలకు తక్కువమందికే అవకాశం.. వ్యాపార కార్యకలాపాలకు సమయం కుదింపు.. ఇన్ని కరోనా ఆంక్షలున్నా, విద్యార్థులు మాత్రం పరీక్షలు రాయల్సిందేనన్నట్టుంది వ్యవహారం. తరగతి గదిలో ఎక్కువమంది కూర్చుని పరీక్ష రాస్తే, తద్వారా కరోనా తమకూ సోకి ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందేమోనని భయపడుతున్న విద్యార్థులు, పరీక్షలకు మానసికంగా ఎలా సిద్ధపడతారు.? అన్న కనీసపాటి విజ్నత పాలకుల్లో లేకపోవడమేంటనే చర్చ సర్వత్రా జరుగుతున్న విషయం విదితమే.

ప్రాణం వుంటేనే, ఏ సర్టిఫికెట్ విలువ గురించైనా మాట్లాడుకునేది. కరోనా అంటే ఆషామాషీ వ్యవహారం కాదు కాబట్టే, కర్ఫ్యూలు, మినీ లాక్ డౌన్ వ్యవహారాలు, అనేక ఆంక్షలు. ఓ వైపు కరోనా కట్టడి కోసమంటూ చర్యలు తీసుకుంటూనే, ఇంకోపక్క విద్యార్థుల పరీక్షల విషయమై ఎందుకు ప్రభుత్వం అర్థం పర్థం లేని ప్రతిష్టకు పోతోందో అర్థం కాని పరిస్థితి. దేశంలో చాలా రాష్ట్రాలు పదో తరగతి పరీక్షల్ని రద్దు చేశాయి. అంటే, అక్కడి విద్యార్థులెవరికీ ఉద్యోగాలు రావా.? అక్కడి ప్రభుత్వాలకి తమ విద్యార్థుల పట్ల బాధ్యత లేదని అర్థం చేసుకోవాలా.?

అధికార పార్టీ నేతలకు కరోనా వస్తే, ఏమాత్రం సంకోచించకుండా.. పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు వైద్య చికిత్స నిమిత్తం. కానీ, సామాన్యులు.. ఆసుపత్రుల్లో పడకల కోసం మందుల కోసం, ఆక్సిజన్ కోసం నానా తంటాలూ పడాల్సి వస్తోంది. ఓ రకంగా చూస్తే, దీన్ని మెడికల్ ఎమర్జెన్సీగా చాలామంది అభివర్ణిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పరీక్షలు, సర్టిఫికెట్లలో మార్కులే ముఖ్యమంటూ ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు విద్యార్థి లోకంలో తీవ్ర అసహనానికీ, ఆందోళనకీ కారణమవుతున్నాయి.