వైఎస్ జగన్ సర్కార్ జాబ్ క్యాలెండర్.. నిరుద్యోగుల నజర్.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నానా హంగామా నడుమ ఇటీవల జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన విషయం విదితమే. పత్రికల్లో ప్రకటనలు, ప్రత్యేకంగా క్యాలెండర్ ఆవిష్కరణ.. అబ్బో.. నడిచిన హంగామా అంతా ఇంతా కాదు. నిరుద్యోగులు ఫుల్ ఖుషీ అన్నారు.. గడచిన రెండేళ్ళలో ఉద్యోగాలు పొందినవారు డబుల్ హ్యాపీ అన్నారు. కట్ చేస్తే.. నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నారు.. వాలంటీర్లూ ప్రభుత్వం తీరుపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

‘అప్పుడేమో వాలంటీర్లు ఉద్యోగులు కారన్నారు.. వాలంటీర్లకు ఇచ్చేది గౌరవం వేతనం తప్ప, జీతం కాదన్నారు.. ఇప్పుడేమో, జాబ్ క్యాలెండర్.. అంటూ మాకు ఇచ్చిన పోస్టుల్నీ ఉద్యోగాల కింద జమ వేసేశారు.. మేం ఉద్యోగులమని చెబుతున్నారు గనుక, మా వేతనాలు పెంచాల్సిందే..’ అంటున్నారు వాలంటీర్లు.

మరోపక్క, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు, ప్రభుత్వంపై తీరుపై మండిపడుతూ ఆందోళనలు చేపట్టారు. ఎక్కడికక్కడ రాస్తా రోకోలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించేస్తున్నారు. బహుశా ఈ తరహా రెస్పాన్స్.. వైఎస్ జగన్ సర్కార్ ఊహించి వుండదు. పోలీసు శాఖలో ఉద్యోగాల కోసం ఆశలు పెట్టుకున్నవారు.. ఇతర విభాగాల్లో ఉద్యోగాలు దక్కుతాయని ఆశపడినవారు.. తీవ్రమైన భంగపాటుకు గురయ్యారు వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్ తర్వాత.

అసలు వున్న ఖాళీలెన్ని.? వాటినెందుకు భర్తీ చేయడంలేదు.? అంటూ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. దాంతో, వైసీపీ నేతలకు సమాధానం చెప్పలేని దుస్థితి ఏర్పడింది. విపక్షాల విమర్శలపై ఎదురుదాడి చేయడం అధికార పార్టీకి మామూలే. కులా వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా నేతల్ని రాజకీయ ప్రత్యర్థుల మీదకు ఉసిగొల్పడం అనేది సర్వసాధారణమైపోయింది. కానీ, నిరుద్యోగుల ప్రశ్నలకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్పగలుగుతుంది.?

మొత్తమ్మీద వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్.. అప్పుడే అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ విషయమై తొలి రోజే నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందనీ.. దాంతో, కొత్త క్యాలెండర్ అతి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు ప్రభుత్వం చేస్తోందంటూ.. అధికార పార్టీ నుంచే లీకులు రావడం కొసమెరుపు.