ప్రజా వేదిక గుర్తుందా.? మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక నివాసానికి దగ్గరలో దీన్ని, ప్రజా అవసరాల నిమిత్తం నిర్మించారు. తాత్కాలిక నిర్మాణమే అయినా, అప్పటి ప్రభుత్వానికి సంబంధించి కొన్ని అధికారిక అవసరాల కోసం చాలా బాగా ఉపయోగపడిందిది. సుమారు 7 కోట్ల దాకా దీని నిర్మాణం కోసం ఖర్చు చేశారనే చర్చ అప్పట్లో జరిగింది. మరీ, అంత ఎక్కువ ఖర్చు చేయలేదని ఆ తర్వాత టీడీపీ చెప్పుకుందనుకోండి. అది వేరే సంగతి.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతూనే, ప్రజా వేదికను కూల్చేశారు. అందుక్కారణం, ఆ ప్రజా వేదికను ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఉపయోగించే ఉద్దేశ్యం లేకపోతే, తమకు అప్పగించాలని టీడీపీ కోరడమే. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు, ప్రజల్ని కలిసేందుకు దాన్ని ఉపయోగిస్తామని టీడీపీ చెప్పుకొచ్చింది. సరే, ప్రజా వేదిక వెనుక వున్న రాజకీయమేంటి.? ఎందుకు ఆ ఒక్కదాన్నే కూల్చేసి, రెండేళ్ళలో కరకట్ట దిగువన వున్న ఏ నిర్మాణాన్నీ ఎందుకు కూల్చలేదు.? అన్నది వేరే చర్చ.
ఇప్పుడు ఆ కరకట్టను వెడల్పు చేసేందుకు జగన్ ప్రభుత్వం సంకల్పించింది. కరకట్ట వెడల్పు చేసేందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన కూడా చేస్తున్నారు. అంటే, పోయిన చోట వెతుక్కోవడం లాంటిదే ఇది కూడా.. అని అనుకోవాలేమో.
అసలు అమరావతిని స్మశానం అన్న వైసీపీ, అమరావతిని ఎడారిగా పోల్చిన వైసీపీ.. అమరావతిని ముంపు ప్రాంతంగా అభివర్ణించిన వైసీపీ.. ఇప్పుడెలా కరకట్టను వెడల్పు చేసి, శాసన రాజధాని అమరావతికి వెళ్ళేందుకు అద్భతమైన రీతిలో రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు చెబుతోందట.? అప్పుడు తప్పు.. ఇప్పుడు రైటవుతోదన్నమాట.
ఎలాగైతేనేం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాస్త మారారు. మార్పు మంచిదే. అమరావతి, ఆంధ్రపదేశ్ ప్రజల రాజధాని. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అమరావతిలో అవినీతి జరిగితే, అవినీతిపరుల్ని శిక్షించాలి.. అంతే తప్ప, రాష్ట్ర రాజధాని కోసం భూములిచ్చిన రైతుల్ని హింసించడం సరికాదు. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని ఇంకెన్నాళ్ళు ప్రపంచం దృష్టిలో పలచన చేస్తారు.?
నిజానికి, శాసన రాజధాని అన్న సోయ ఏమాత్రం వున్నా, గడచిన రెండేళ్ళలో అమరావతి చాలా చాలా అభివృద్ధి జరిగి వుండేది. గడచిన రెండేళ్ళలో జగన్ ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్స్ కోసం వెచ్చించిన మొత్తాన్ని రాజధాని అమరావతి మీద వెచ్చించినా.. అత్యద్భుతమైన అమరావతిని మనం ఈరోజు చూసి వుండేవాళ్ళం. కరకట్ట రోడ్డు వెడల్పు నిమిత్తం శంకుస్థాపన చేయడానికే రెండేళ్ళు పట్టిందంటే.. ఆ రోడ్డు మీద తారు పడేందుకు ఇంకెన్నేళ్ళు పడుతుందో ఏమో.