నిజమేనా.? జగన్, షర్మిల మధ్య అంత దూరం పెరిగిందా.?

రూపాయ్.. రూపాయ్.. నువ్వేం చేయగలవ్.? అని ప్రశ్నిస్తే, అన్నదమ్ముల్ని విడగొట్టగలను.. అని చెప్పిందట. రాజకీయం కూడా అంతే. వైఎస్ జగన్, షర్మిల మధ్య కూడా రాజకీయం అలాగే, అంత చిచ్చు రగిల్చిందా.? అన్న, చెల్లెలు ఎదురెదురు పడే పరిస్థితి కూడా లేనంతగా ఇద్దరి మధ్యా విభేదాలు పెరిగిపోయాయా.? అంటే, ఔననే చర్చ మీడియా, రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

కానీ, ఇదంతా నిజమేనా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. తెలంగాణలో షర్మిల కొత్త రాజకీయ పార్టీ పెట్టడాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా వ్యతిరేకించారట. ఈ విషయాన్ని గతంలోనే వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సెలవిచ్చారు. మరోపక్క, షర్మిల పెట్టబోయే పార్టీకి జగన్ నుంచి సపోర్ట్ వుంటుందా.? లేదా.? అన్న ప్రశ్నకు షర్మిల స్వయంగా సమాధానమిస్తూ, ఆ ప్రశ్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడగండంటూ ఎదురు ప్రశ్నించారు.

ఇక, కొత్త పార్టీ పెట్టేముందు తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు షర్మిల. అదే రోజు, అదే సమయానికి వైఎస్ జగన్ కూడా ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించాల్సి వుంది. ఎందుకంటే, ఆ రోజు వైఎస్సార్ జయంతి గనుక. షర్మిలను కలవడం ఇష్టం లేక, ఏకంగా వైఎస్ జగన్ తన పర్యటన షెడ్యూల్ మార్చేసుకున్నారట.

ఉదయం షర్మిల, ఇడుపులపాయ సందర్శన వుంటే.. సాయంత్రానికి వైఎస్ జగన్ పర్యటన వుండబోతోందిప్పుడు. ఈ మార్పు వెనుక, షర్మిలను కలవకూడదన్న వైఎస్ జగన్ గట్టి ఆలోచనే ప్రధాన కారణమనే విషయం బయటకు వచ్చేలా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు ఇరువురూ.

‘అవసరమైతే తెలంగాణ కోసం నా అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కూడా పోరాటానికి సిద్ధమే..’ అని షర్మిల ప్రకటించిన విషయం విదితమే. అదే, ఆ మాటని నిజం చేయడానికి, తద్వారా తెలంగాణలో సింపతీ సంపాదించడానికీ షర్మిల ప్రయత్నిస్తున్నారని అనుకోవాలి.

ఇదిలా వుంటే, 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి తనవంతుగా కష్టపడినా, ఎన్నికల ప్రచారం కోసం చాలా చాలా కష్టపడినా, అంతకు ముందు సుదీర్ఘ పాదయాత్ర చేసినా.. అధికారంలోకి వచ్చాక, తన అన్న వైఎస్ జగన్ తనను మర్చిపోవడాన్ని షర్మిల జీర్ణించుకోలేక, వేరు కుంపటి (రాజకీయంగా) పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో షర్మిల పార్టీ పెట్టాలిగానీ, తెలంగాణలో పెట్టడమేంటి.?

ఇరు రాష్ట్రాల్లోని ప్రజల్ని వెర్రి వెంగళప్పల్ని చేసేందుకే అత్యద్భుతమైన ఈ రాజకీయ నాటకం అన్నా చెల్లెళ్ళ మధ్య నడుస్తోందన్నది మెజార్టీ అభిప్రాయం.