అధికార పార్టీకి చెందిన నేతలు ఫిర్యాదులు చేయగానే, విపక్షాలకు చెందిన నేతలు, కార్యకర్తల అరెస్టులు ఆగమేఘాల మీద జరిగిపోతాయ్.! అదే, అధికార పార్టీ నేతల మీద ఎన్ని ఫిర్యాదులు చేసినా అస్సలు కేసులు నమోదు కావు. ఈ అభిప్రాయం, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా బాగా బలపడిపోయింది.
నిజానికి, ఈ అభిప్రాయం చంద్రబాబు హయాంలోనూ వినిపించింది. ఇప్పుడది ఇంకాస్త గట్టిగా వినిపిస్తోందంతే. చిత్రమేంటంటే, ఫలానా నాయకుడ్ని జైలుకు పంపిస్తాం.. అని అధికార పార్టీకి చెందిన కీలక నేతలు ముందుగా హెచ్చరించి మరీ, వారిని అరెస్టు చేయిస్తున్నారు.
‘కార్యకర్తలు మిమ్మల్ని తరిమికొడతారు.. మిమ్మల్ని జైలుకు పంపించి తీరతాం..’ అంటూ దేవినేని ఉమపై వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు ఇటీవల తీవ్రమైన హెచ్చరికలు చేసిన విషయం విదితమే. అందుకు అనుగుణంగానే ఆయన అరెస్టు జరిగింది.
అంతకు ముందు అచ్చెన్నాయుడి విషయంలోనూ అదే జరిగింది. కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డి.. అబ్బో, చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే. చంద్రబాబు, లోకేష్ మీద కూడా అధికార పార్టీ సీరియస్‌గానే ప్లాన్ చేస్తోందిగానీ, ఎక్కడో ఈక్వేషన్ సరిగ్గా సెట్ అవడంలేదంతే.
రాజకీయాల్లో అరెస్టులు వింత కాదు. అయినా, అధికార పార్టీ అధినేత.. అందునా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళి వచ్చారు గనుక, అలాంటి వ్యక్తి పాలనలో, అంబేద్కర్ రాజ్యాంగం ఎలా అమలవుతుందని ఆశించగలం.? అంటూ విపక్షాలు అనుమానం వ్యక్తం చేయడాన్ని తప్పు పట్టలేం.
అరెస్టులు చేస్తున్నారు, జైళ్ళకు తరలిస్తున్నారు.. దాదాపుగా చాలా కేసుల్లో నేతలు తేలిగ్గానే బయటకు వచ్చేస్తున్నారు. మరిక్కడ అధికార పార్టీ సాధించిందేంటి.? వారి అరెస్టు విషయంలో పోలీసులకు న్యాయస్థానాల్లో ఎదురవుతున్న చీవాట్ల సంగతేంటి.?
చిత్రమేంటంటే, పోలీసు వ్యవస్థ తనను తాను ప్రశ్నించుకోలేకపోవడం. చంద్రబాబు హయాంలోనూ పోలీసు వ్యవస్థపై తీవ్ర స్థాయి విమర్శలొచ్చాయి. ఇప్పుడైతే అసలు పోలీసు వ్యవస్థ మీద గౌరవమే లేకుండా పోయిందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. రివెంజ్ రాజకీయాలకి, పోలీసు వ్యవస్థ బలైపోతుండడం అత్యంత బాధాకరమైన విషయమని ప్రజాస్వామ్యవాదులు వాపోతున్నారు.
ప్రభుత్వం మారితే, ఇదే పోలీసులు.. ఇప్పుడు అధికారంలో వున్న నాయకుల్నే రేప్పొద్దున్న జైళ్ళకు పంపించాల్సి వస్తుంది.. ఇందులో అనుమానమేమీ లేదు.