ముఖ్యమంత్రిగారూ.. ఫేస్ మాస్కు ఇలాగేనా వాడేది.?

ఫేస్ మాస్కుని మొహం తుడుచుకోవడానికి ఎవరైనా వాడతారా.? స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అప్పటిదాకా తాను ధరించిన ఫేస్ మాస్కుని తీసి.. మొహం తుడుచుకున్నారు.. చెమటలు అంతలా పట్టేశాయ్ మరి. తూచ్, అదంతా ఫేక్.. ప్రసంగించేందుకోసం ఫేస్ మాస్కు తీశారు.. ఆ తర్వాత అక్కడ వున్న కర్చీఫ్ తీసుకుని మొహం తుడుచుకున్నారు.. అన్నది వైసీపీ మద్దతుదారుల వివరణ. ఇందులో ఎంత నిజమన్నది వేరే చర్చ.

కానీ, తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూళ్ళను నిన్నటి నుంచి తెరవగా, స్కూళ్ళలో చేపట్టిన ‘నాడు-నేడు’కి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇక్కడా మాస్కుని అలాగే వాడారు. మాస్కు తీశారు.. మొహానికి పట్టిన చెమటల్ని తుడుచుకున్నారు. మొదటి నుంచీ ఫేస్ మాస్కు విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఫేస్ మాస్కు అస్సలు ధరించకపోవడం, ఒకవేళ ఫేస్ మాస్క్ ధరించినా.. దాన్ని సరిగ్గా ధరించకపోవడం.. ఇలా జగన్ తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు.. ఏడాదిన్నర కాలంగా. అయినా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో మార్పు రాలేదా.? అంటే, ఔననే చెప్పాలేమో.

లేకపోతే.. అప్పటిదాకా కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం వాడిన ఫేస్ మాస్కు, ఆ తర్వాత తీసేసి.. దాంతోనే మొహం తుడుచుకోవడమేంటి.? సభ్య సమాజానికి ఆయన ఏం సందేశమిస్తున్నట్లు.? అన్నట్టు, ఈ కార్యక్రమంలో చాలామంది అధికారులు, ప్రజా ప్రతినిథులు ఫేస్ మాస్కులు ధరించలేదు. అదే సామాన్యులెవరైనా ఫేస్ మాస్కు ధరించకపోతే.. జరీమానా వసూలు చేసేస్తారు. ‘ముక్కు పిండి మరీ వసూలు చేసేలా’ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చింది. స్వయానా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పలు సమీక్షా కార్యక్రమాల్లో ప్రజలంతా మాస్కు ధరించేలా చూడాలనీ, మాస్కు ధరించనివారికి జరీమానా వేయాలనీ అధికారులను ఆదేశించారాయె.

నీతులు చెప్పేటందుకే.. పాటించేటందుకు కాదని పెద్దలు చెబుతుంటారు. నీతులే కాదు, నిబంధనలు అలాగే ఆదేశాలు కూడా అంతేనేమో.