సినిమా టిక్కెట్లను ప్రభుత్వం విక్రయించడమేంటి.? మటన్ దుకాణాల్ని ప్రభుత్వమే ‘మొబైల్ వాహనాల ద్వారా’ నిర్వహించాలను కోవడమేంటి.? మత్స్య సంపద విషయంలో ప్రభుత్వమెందుకు అత్యుత్సాహం చూపుతోంది.? అసలేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.? రోజుకో వివాదం తెరపైకొస్తోంది. మటన్ మార్ట్స్ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మత్స్య సంపద విషయంలో మత్స్యకారులకు షాకిచ్చే నిర్ణయం నుంచి ఇంకా వెనక్కి తగ్గాల్సి వుంది. సినిమా టిక్కెట్ల వ్యవహారంపై ‘ముందుకే’ అంటోంది వైఎస్ జగన్ సర్కార్.
అసలు ప్రభుత్వమే, ‘ప్రైవేటు’ని అమ్మితే నష్టమేంటి.? అన్నది ఇంకో చర్చ. ఔను, తప్పేముంది.? అన్నీ ప్రభుత్వం కనుసన్నల్లోనే జరిగితే.. ప్రజలకు మేలు జరుగుతుంది కదా.? నిజమే, ప్రజలకు మేలు జరుగుతుంది.. కానీ, ప్రభుత్వ పెత్తనంతో వ్యాపారాలన్నీమూసుకుపోతే తలెత్తే ఆర్థిక సంక్షోభానికి బాధ్యత వహించేదెవరు.?
సినిమా టిక్కెట్ల వివాదాన్నే తీసుకుంటే, పెద్ద సినిమాల విడుదల అటకెక్కింది. పైకి కనిపిస్తున్నదానికంటే దారుణమైన సంక్షోభం సినీ పరిశ్రమలో వుంది. ముందు ముందు థియేటర్ల వ్యవస్థ సర్వనాశనమైపోయేలా వుంది. అదే జరిగితే వందలాది, వేలాది కుటుంబాలు రోడ్డున పడిపోతాయ్. వాళ్ళ బాధ్యత ఎవరిది.? సినిమా టిక్కెట్లు, మటన్ దుకాణాలు, మత్స్య సంపద వ్యవహారాలు.. ఇవన్నీ పక్కన పెడితే, కీలకమైన అంశాలు చాలానే వున్నాయి. విద్య, వైద్యం.. అనేవి అతి ముఖ్యమైనవి.
విద్య ఎప్పుడో వ్యాపారమైపోయింది.. వైద్యం సంగతి సరే సరి. ఈ రెండిటిపైనా సర్కార్ ఫోకస్ పెడితే మంచిదేమో. ప్రైవేటు విద్యకు సంబంధించిన ఫీజులు, ప్రైవేటు వైద్యానికి సంబంధించిన పీజులు.. ఇవన్నీ ప్రభుత్వమే నిర్ణయించి, నిర్వహిస్తే.. సమాజానికి చాలా మేలు జరుగుతుంది. కానీ, అలా చేస్తే.. వాటిని నిర్వహిస్తున్న రాజకీయ నాయకులేమైపోవాలి.? అందుకే, అటువైపు మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టదు. ప్రైవేటు ట్రావెల్స్ వ్యవహారంలోనూ అంతే.
ఒక్కటి మాత్రం నిజం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్థం పర్థం లేని అంశాల చుట్టూ అనవసర రాద్ధాంతం జరుగుతోంది. ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించడానికి, ప్రభుత్వ వైఫల్యాలు కనపడనీయకుండా చేయడానికీ.. ప్రభుత్వ పెద్దలే ఈ సిల్లీ ఐడియాస్ తెరపైకి తెస్తున్నారేమో.