వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విభేదించి, తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెడుతున్నట్లు గతంలో సాక్షాత్తూ వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల రామకృష్ణారెడ్డి సెలవిచ్చారు. ‘పార్టీ పెట్టొద్దన్ని జగన్ వారించారు.. అయినా, షర్మిల వినలేదు. వైసీపీతో, షర్మిలకు సంబంధాలు ఇకపై వుండవు.. అన్నా చెల్లెళ్ళ మధ్య అనుబంధం విషయంలో ఎలాంటి ఇబ్బందులూ వుండకపోవచ్చు..’ అని సజ్జల సెలవిచ్చిన విషయం విదితమే. కానీ, అసలు విషయమేంటో ఇప్పడిప్పుడే అందరికీ బోధపడుతోంది.
మొదట్లో సాక్షి మీడియాలో షర్మిలకు సంబంధించిన వార్తలు కనిపించలేదు. ఇప్పటికీ చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తున్నాయి. చిత్రమేంటంటే, సాక్షికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే కాదు, షర్మిల కూడా యజమానే. ఈ విషయాన్ని షర్మిల స్వయంగా ప్రకటించారు. సాక్షి తెలంగాణ విభాగాన్ని టేకప్ చేస్తున్నారట కదా.? అన్న ప్రశ్నకు బదులిచ్చిన షర్మిల, ‘సాక్షికి నేను కూడా సహ యజమానిని..’ అని చెప్పారు. మరి, సాక్షిలో ఎందుకు వైటీపీ (వైఎస్సార్ తెలంగాణ పార్టీ) వార్తలు కనిపించడంలేదు.? ఏమో, ఈ ప్రశ్నకు ఎవరు సమాధానమిస్తారో మరి.
అక్కడ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కష్టపడ్డారు.. అధికారంలోకొచ్చారు. ఇక్కడా, నేనూ కష్టపడుతున్నాను.. అధికారంలోకి వస్తానని షర్మిల ధీమాగా చెప్పారు. అంతేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్, వైఎస్సార్సీపీ తరఫున పనిచేయనున్నట్లు కొద్ది రోజుల క్రితమే ప్రకటితమైంది. షర్మిల కూడా తనకూ ప్రశాంత్ కిషోర్ సహాయ సహకారాలు అందించనున్నట్లు ప్రకటించారు. అంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ ఒకే వైపు నుంచి పేమెంట్ అందుకోనున్నారన్నమాట.. రాజకీయ వ్యూహాలకు సంబంధించి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకే ఒక్క అక్షరం మారింది.. అదే కాంగ్రెస్.. ఆ స్థానంలో షర్మిల తెలంగాణని తీసుకొచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ తెలంగాణలో.. ఇదీ నిఖార్సయిన బులుగు రాజకీయం. రెండు రాష్ట్రాలకీ వేర్వేరు ప్రయోజనాలుంటాయట. వాటిని కాపాడేందుకు అక్కడ జగన్, ఇక్కడ షర్మిల ప్రయత్నిస్తున్నారట. ఇలాంటి రాజకీయం న భూతో న భవిష్యతి.