ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహం వర్కవుటైనట్లే ఉంది. దక్షిణాది రాష్ట్రాల జోనల్ కమిటి సమావేశంలో మాట్లాడుతు పెండింగ్ లో ఉన్న విభజన హామీల అమలుపై జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి జోనల్ కమిటి ఛైర్మన్ అమిత్ షా ముందు ప్రస్తావించారు. ప్రత్యేకహోదాను అమలు చేయలేదని తెలుగురాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కమిటి వేయాలని తెలంగాణా నుండి విద్యుత్ బకాయిలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని ఇలా.. చాలా సమస్యలనే ప్రస్తావించారు.
ఇంతకాలం ఢిల్లీకి వెళ్ళి నరేంద్రమోడిని కలిసినపుడో లేకపోతే అమిత్ ను కలిసినపుడో విభజన సమస్యల అమలును జగన్ డిమాండ్ చేస్తున్నారు. దాదాపు వన్ టు వన్ గా జరిగే భేటీల్లో జగన్ ఏ అంశాలను ప్రస్తావించింది మోడి లేదా అమిత్ ఎలాంటి హామీలిచ్చారనేది పెద్దగా బయటకు తెలీదు. అందుకనే తాజాగా తన డిమాండ్లను ప్రస్తావించటానికి తాజా సమావేశాన్ని ఉపయోగించుకోవాలని జగన్ గట్టిగానే డిసైడ్ అయ్యారు.
ముందుగా అనుకున్నట్లుగానే సమావేశంలో పాల్గొన్న సీఎంలు గవర్నర్లు ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారుల సమక్షంలోనే పెండింగ్ లో ఉన్న విభజన హామీల అమలును ప్రస్తావించారు. ప్రత్యేకహోదాతో పాటు విభజన హామీలు పెండింగ్ లో ఉన్న కారణంగా ఏపీ అభివృద్ధికి ఏ విధంగా అన్యాయం జరుగుతోందో వివరించారు. చంద్రబాబునాయుడు హయాంలో పరిమితి దాటారని రుణాలపై ఇపుడు కోత విధిస్తున్నారని జగన్ వివరించారు.
జగన్ అనుకున్నట్లుగానే సమస్యలను ప్రస్తావించగానే అమిత్ కూడా సానుకూలంగా స్పందించటం విశేషం. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు రెండు రాష్ట్రాలకే పరిమితం కాదని అవి జాతీయ అంశాలుగా షా పేర్కొన్నారు. జగన్ ప్రస్తావించిన అన్నీ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటామన్నారు. తప్పకుండా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని సమావేశంలోనే షా జగన్ కు హామీ ఇచ్చారు.
జగన్ ఆశించిందే సమావేశంలో జరిగింది. సమావేశంలో అందరిముందు విభజన హామీల అమలుకు కేంద్రాన్ని కమిట్ చేయించటమే జగన్ టార్గెట్. టార్గెట్ వరకు జగన్ బాగానే రీచయ్యారు. అయితే అమిత్ షా హామీ ఇచ్చినట్లుగా నిలుపుకుంటారా లేదా అన్నదే ఇపుడు చూడాలి. గడచిన ఏడున్నరేళ్ళుగా పెండింగ్ కానీ సమస్యలను ఒక్కసారిగా పరిష్కరించటం జరిగే పనికాదు. పైగా ప్రత్యేకహోదా లాంటి కీలకమైన హామీలను నెరవేర్చే ఉద్దేశ్యం కూడా కేంద్రానికి లేదని అర్ధమైపోతోంది. మరి తాజా సమావేశంలో షా హామీ ఇచ్చిన హామీ ఏ మేరకు నెరవేరుతుందో చూడాల్సిందే.