వైఎస్ షర్మిల పాదయాత్ర.. అన్నతో పోల్చితే కాస్త డిఫరెంట్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో.. అది రాజకీయ సంకల్ప యాత్ర.. అధికారం కోసం చేపట్టిన సంకల్ప యాత్ర.. అధికారాన్ని తెచ్చిపెట్టింది కూడా. అధికారంలోకి వచ్చాక.. మళ్ళీ జనంలోకి వెళ్ళిన పాపాన పోలేదు వైఎస్ జగన్.. అన్న విమర్శలున్నాయనుకోండి.. అది వేరే సంగతి.

అంతకు ముందు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా సుదీర్ఘ పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. నిజానికి వైఎస్సార్ పాదయాత్రతో వైఎస్ జగన్ పాదయాత్రను పోల్చలేం.. పోల్చి చూసి వైఎస్సార్ పాదయాత్రను అవమానించలేం.. అంటారు చాలామంది.

ఇక, ఇప్పుడు అన్న బాటలో చెల్లెమ్మ వైఎస్ షర్మిల పాదయాత్రకు సిద్ధమయ్యారు. 400 రోజులపాటు సుమారు 4000 కిలోమీటర్ల మేర షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో పాదయాత్ర చేస్తారట. రేపట్నుంచే ప్రారంభమవుతుందిది. ఉదయం ఓ నాలుగు గంటలు, ఆ తర్వాత ఓ రెండున్నర గంటలు రెస్ట్ తీసుకుని, మరో మూడు గంటల పాటు పాదయాత్ చేస్తారట షర్మిల. కాన్సెప్ట్ అదిరింది కదూ.!

రోజుకి సరాసరి పది కిలోమీటర్ల మేర పాదయాత్ర వుండేలా ప్లాన్ చేశారు. ఈ నెల 20వ తేదీన ఉదయం 11 గంటలకు చేవెళ్ళలో పాదయాత్ర ప్రారంభమవుతుంది. నిజానికి షర్మిలకు పాదయాత్ర కొత్తేమీ కాదు. గతంలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు షర్మిల.. అదీ అన్న వైఎస్ జగన్ కోసం.

ఆ అన్న వైఎస్ జగన్ రాజకీయంగా తనకు మొహం చాటేయడంతో, తెలంగాణలో కొత్త కుంపటి పెట్టారు.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో. పాదయాత్ర చేస్తే అధికారంలోకి రావొచ్చన్న సెంటిమెంట్ తెలుగునాట బలంగా వుంది. మరి, షర్మిల కోరిక నెరవేరుతుందా.? ఆమె రాజకీయ ప్రస్థానం ఎలాంటి మలుపులు తిరగబోతోంది.? వేచి చూడాల్సిందే.