అన్న వైఎస్ జగన్ తనకు రాజకీయంగా ప్రాధాన్యతనివ్వకపోవడంతో, తెలంగాణలో కొత్త రాజకీయ కుంపటికి శ్రీకారం చుట్టారు షర్మిల. ‘నాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ప్రాధాన్యత, పదవులు దక్కలేదో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడగండి..’ అంటూ షర్మిల మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఘాటుగా సమాధానమిచ్చారంటేనే, తెరవెనుక ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
సరే, తెలంగాణలో పార్టీ నడిచే పరిస్థితి లేకపోవడంతో అత్యంత వ్యూహాత్మకంగా వైఎస్సర్సీపీ కుంపటిని రద్దు చేసి, షర్మిల పేరుతో కొత్త కుంపటిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ షురూ చేశారన్న విమర్శలు లేకపోలేదనుకోండి. షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని పెట్టడాన్ని తప్పు పట్టలేం. ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చు.. రాజకీయ పార్టీలు పెట్టొచ్చు. కానీ, తెలంగాణ సమాజానికి షర్మిల ఏం చెబుతారు.? ఆ తెలంగాణ సమాజం షర్మిలను ఎలా అర్థం చేసుకుంటుంది.? అన్నదే కీలకం ఇక్కడ.
వైఎస్సార్.. ఇదొక పేరు కాదు, బ్రాండ్.. అన్నది వైఎస్ జగన్ ఆలోచన. అదే ఆలోచన షర్మిలలోనూ వుంది. ఆ వైఎస్సార్ అనే పేరుతోనే తమ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని షర్మిల విశ్వసిస్తున్నారు. రేపే షర్మిల పార్టీకి సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశముంది. ‘వైఎస్సార్’ అనే పేరుతోనే షర్మిల పార్టీ పేరు వుంటుందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. అచ్చంగా అదే బాటలో తెలంగాణలో షర్మిల పెట్టబోయే పార్టీ పేరు కూడా వుండబోతోందట. ఈ విషయాన్ని షర్మిల వెంట నడుస్తోన్న కొందరు నేతలు చెబుతున్నారు.
కాగా, అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నుంచీ, కాంగ్రెస్ పార్టీ నుంచే కాక, బీజేపీ నుంచి కూడా కొందరు నేతలు షర్మిల పార్టీలో చేరబోతున్నారన్నేది మరో ఆసక్తికరమైన గాసిప్. వాళ్ళెవరన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్. తినబోతూ రుచెందుకు.. మరికొద్ది గంటల్లోనే పూర్తి స్పష్టత వచ్చేయనుంది షర్మిల పార్టీపై.