కొనసాగుతున్న షర్మిల దీక్ష

తెలంగాణలో నిరుద్యోగుల సమస్యల పరిష్కరించాలంటూ పోరుబాటు పట్టిన దివంగత వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల చేపట్టిన ఉద్యోగ దీక్ష శుక్రవారం రెండో రోజు కొనసాగుతోంది. ఆమె మూడురోజులపాటు దీక్ష చేయాలని సంకల్పించగా.. పోలీసులు ఒక్కరోజు మాత్రమే అనుమతించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద షర్మిల దీక్ష ప్రారంభించారు. దీక్షకు ఒక్కరోజు మాత్రమే అనుమతి ఉందని చెప్పిన పోలీసులు సాయంత్రానికి భగ్నంచేశారు. దీంతో ఇందిరాపార్కు నుంచి లోటస్ పాండ్ కు పాదయాత్రగా బయలుదేరిన ఆమెను బీఆర్కేఆర్ భవన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని లోటస్ పాండ్ లో వదిలిపెట్టారు. అప్పటినుంచి ఆమె అక్కడే తన దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రాణం పోయినా మంచినీళ్లు కూడా ముట్టనని.. 72 గంటలపాటు నిరాహార దీక్ష చేస్తానని శపథం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు.