గొడ్డలితో తెగ నరికితే గుండె పోటు వచ్చి చచ్చిపోవడమేంట్రా.? అనే డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయిపోయింది. ఔను మరి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్యను, గుండు పోటు కారణంగా సంభవించిన మరణంగా చిత్రీకరించేందుకు ‘కొందరు’ పడ్డ పాట్లు అలాంటివి. రక్తపు మరకల్ని చెరిపేందుకు ప్రయత్నించారు.. గొడ్డలి పోట్ల కారణంగా ఏర్పడిన గాయాలకు కట్టు కట్టేశారు.. చాలా చాలా చేశారు వైఎస్ వివేకా హత్యను ఏమార్చేందుకు. ఎవరు చేశారు.? ఎందుకు చేశారు.? అన్నది విచారణలో తేలాల్సి వుంది.
రెండేళ్ళుగా ఈ కేసు విచారణ కొనసాగుతూనే వుంది. తొలుత సిట్ విచారణ.. ఆ తర్వాత సీబీఐ విచారణ. ఓ మాజీ మంత్రి అత్యంత పాశవికంగా హత్యకు గురైతే, ఇంతవరకు దోషులెవరో తేలకపోవడం.. మొత్తంగా పోలీసు వ్యవస్థకే అవమానకరం. సొంత బాబాయ్ హత్య కేసులో దోషుల్ని పట్టుకోలేకపోవడమంటే, అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరింత అవమానకరం.
ఇక, తాజాగా సీబీఐ ఈ కేసులో కీలకమైన ముందడుగు వేసింది. వాచ్‌మెన్ రామయ్య నుంచి వాంగ్మూలం తీసుకుంది. ఆయన స్టేట్‌మెంట్‌ని మెజిస్ట్రేట్ సమక్షంలో రికార్డ్ చేసింది సీబీఐ. ఇద్దరు ప్రముఖులు 8 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చి, వివేకానందరెడ్డిని హత్య చేయించారనని వాచ్‌మెన్ రంగయ్య పేర్కొన్నాడట. హత్య జరిగిన సమయంలో ఐదుగురు కొత్త వ్యక్తులు వచ్చారట. హత్యలో మొత్తం 9 మంది భాగంగా వున్నారట. ఈ విషయాలన్నీ రంగయ్య, మెజిస్ట్రేట్ సమక్షంలో సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించాడట.
ఇదీ గత కొద్ది రోజులుగా ఏకబిగిన సీబీఐ చేపట్టిన విచారణ అనంతరం వెలుగు చూసిన కొత్త కోణం తాలూకు సారాంశం. నిజానికి, గొడ్డలి పోటుని గుండె పోటుగా చిత్రీకరించాలని ఎందుకు ప్రయత్నించారు.? అన్న కోణంలో ‘సిట్’ విచారణ జరిపి వుంటే, వాస్తవాలు ఎప్పుడో వెలుగు చూసేవి. చంద్రబాబే వివేకానందరెడ్డిని హత్య చేయించారని ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
కానీ, ముఖ్యమంత్రి అయ్యాక, చంద్రబాబుని నిందితుడిగా చేర్చి కేసు పెట్టించలేకపోయారు వైఎస్ జగన్. ఇక, ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం వైఎస్ జగన్ స్వయంగా తన బాబాయ్‌ని చంపించారని టీడీపీ నేతలు ఆరోపించారు. కానీ, సిట్ ముందుగానీ, సీబీఐ ముందుగానీ అందుకు తగ్గ ఆధారాల్ని టీడీపీ వుంచలేకపోయింది. మొత్తంగా చూస్తే, వివేకానందరెడ్డి హత్య.. రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు ఓ ఆట వస్తువుగా.. పబ్లిసిటీ స్టంటుగా మారిపోయింది.
ఎలాగైతేనేం, సీబీఐ.. కీలక వివరాల్ని రాబట్టగలిగిందిప్పుడు.. ఇక, ఇప్పుడు.. ఆ ఇద్దరు ప్రముఖులెవరన్నది తేలాల్సి వుంది. 8 కోట్లు ఖర్చు చేసి, వివేకానందరెడ్డిని చంపాల్సిన అవసరం ఎవరికి వుందన్నది తేలాల్సి వుంది. తేలుతుందా.? తేలితే ఎప్పటిలోగా.? వేచి చూడాల్సిందే.